ప్రజల్లో తెరాసకు తిరస్కరణ…రేవంత్ రెడ్డి

Revanth Reddy
హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో తెరాసకు తిరస్కరణ మొదలైందని.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో ప్రశ్నించే గొంతుకకు ప్రజలు పట్టం కట్టారన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో మెజార్టీలు తగ్గడం తెరాస పతనానికి సంకేతమని పేర్కొన్నారు. కరీంగనర్, నిజామాబాద్‌లో తెరాస నేతల ఓటమిపాలయ్యారని.. తెరాస గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే సంకేతమన్నారు. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనమంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు సుమారు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయని చెప్పారు. మల్కాజ్ గిరిలో తన గెలుపుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని రేవంత్ లేఖలో ఎద్దేవా చేశారు.